Tuesday, November 27, 2007

వరి....వరి....వరి....వరి....వరికుచ్చు




వరి....వరి....వరి....వరి....వరి ఎక్కడ చూసినా ఇదే పదం. వార్తాపత్రికలలో, బుల్లితెరపై, రాజకీయనాయకుల నోళ్ళలో, ఆఖరికి అమాయక రైతుల మదిలో కూడా ఇదేమాట ఒక పలవరింతగా ఇటీవల ప్రాచుర్యమై పోయింది. ప్రస్తుతం పంట చేతికివచ్చే సమయంలో రేగిన ఈ చిచ్చు వల్ల రైతుకు జరిగే మేలు మాటేమోగాని కూలివాళ్ళు దొరకక, కూలిరేటు పెరిగి పంట ఇంటికి తెచ్చుకోవడానికి రైతు పడుతున్న తిప్పలు చూస్తే ఎవరికైనా జాలిపుట్టక మానదు. బంగారు రంగులో కోతకు సిద్దంగాఉన్న పొలాలను చూస్తే ఆ మనోహరదృశ్యం మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడున్న ఫొటోలలో ఒకదాంట్లో కోతకు సిద్దంగాఉన్న పొలం, మరొకదాంట్లో కోతకోసిన పొలంకూడా చూడొచ్చు.
వరి కొయ్యడం, పనలను (కోతకోసి, చిన్న చిన్న కుప్పగావేసినవాటిని పనలంటారు) తిరగవెయ్యడం, కట్టలుగాకట్టి తరువాత వెంటనే నూర్చడంగాని, భవిష్యత్తులో నూర్చడానికి కుప్ప వెయ్యడంగాని చేస్తారు. నూర్చడమంటే ఒకచోట వేసి పశువులతోగాని, ట్రాక్టరుతోగాని తొక్కిస్తే వరిగింజలు(వడ్లు) గడ్డినుండి విడివడి మనకు వడ్లరాశినిస్తాయి. పశువులతో త్రొక్కించడానికి ముందు మనుషులతో చిన్నచిన్న కట్టలుకట్టి ఒకఏటవాలు చెక్క బల్లమీద కొడతారు. ఇప్పుడేమో ట్రాక్టరులొచ్చాయి త్రొక్కించడానికి. చాలాచోట్ల వరికోత యంత్రాలు వచ్చాయి....అవే కోస్తాయి, వడ్లను నూరుస్తాయి (తక్కువఖర్చుతో !). వచ్చిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి పూర్వంనేలలొ గుంట తీసి చుట్టూ వరిగడ్డితో అంచుల్ని లైనింగ్ చేసి, వడ్లుపోసి, చెత్తకప్పి పైనకూడా మట్టి కప్పి పాతర వేసేవాళ్ళు. తరువాత వెదురు లేదా అడవి చువ్వలతో అల్లిన గాదెలలో నిల్వచేసేవాళ్ళు. ఇప్పుడేమొ సిమెంటు లేదా ఇనుప గాదెలు వాటి స్థానాన్ని ఆక్రమించేసాయి. ఈ కష్టమంతా పంట పండినతరువాత కథ. పండించడానికి ఎంత శ్రమ పడాలో, ఎంత డబ్బు వెచ్చించాలో,ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనాలొ పాపం ఆ రైతులకే తెలుసు.


మొన్న ఆదివారం నేను తెనాలి దగ్గరలో ఉన్న పెరవలి, చావలి, పెరవలిపాలెం వెళ్ళడం జరిగింది. ఆ ఊళ్ళగురించి మా చిన్నప్పటినుంచి చెప్పుకోవడమే గాని వెళ్ళడం మాత్రం మొన్ననే. మాతాతలకాలం నుండి మాకు ఆ ఊళ్ళతో సంబంధాలున్నాయి. అక్కడ ఎక్కడొ బాపట్ల దగ్గర ఊళ్ళో పశువుల ఆసుపత్రిలో పనిచేస్తున్న మాతమ్ముడు వెంకటేశ్వరరావును కలవడం జరిగింది. కలిస్తే మాకేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది విశేషం. అతగాడు జేబులోంచి ఒక ఫొటో తీసి చూపించాడు..అది మన ముఖ్యమంత్రిగారితో తను "వరి కుచ్చు" ను బహుకరించే సమయంలో తీసి మరునాడు వార్తాపత్రికలలో ప్రచురింపబడింది. అదేంటోననే మా ఉత్సాహాన్ని పసిగట్టి వెంటనే తన సంచిలోనుంచి మరొక వరికుచ్చు బయటికి తీసి మా ముందు ప్రదర్శించాడు. అది ఆ రోజు సాయంత్రం మన మంత్రిగారైన మండలి బుద్ధప్రసాదు గారి బహుకరించడానికట. సరే మన బ్లాగుకు మంచి విషయం దొరికింది కదా అని మన వరికుచ్చుని, దాన్ని బహు నేర్పరితనంతో తయారుచెసిన తమ్ముని కూడా ఫొటోలు తీసి ఇదుగో ఇచ్చట మీకోసం ఇక్కడ అతికిస్తున్నాను.ఆ వరికుచ్చు చూడడానికి చాల సులువుగా చెయ్యవన్నట్లుగా ఉన్నా తయారుచెయ్యడం చాలా కష్టం సుమా!ఆ ముందురోజే రైతుగర్జనలో వరి కంకులతో అల్లిన దండలను నాయకులమెడలలో వెయ్యడం చాలామంది చూసే ఉంటారనుకుంటాను.

Monday, November 5, 2007

శెలవుకు శెలవా????????????

"శెలవు" ఈ మూడక్షరాల మాట ఎవ్వరికైనా ఎంతిష్టమైన మాటోకదా ! మా చిన్నప్పుడు శెలవలిచ్చిన మరునాడే అమ్మమ్మ వాళ్ళ ఊరు ఐనంపూడి(పింగళి వెంకయ్య గారి ఊరు భట్లపెనుమర్రు ప్రక్కనే) చాలా హుషారుగా చేరేవాళ్ళము. చిన్ననాటి స్నేహితులతో కబుర్లు, ఆటలు, చెట్లు పుట్టలవెంట తిరుగుళ్ళు, తాటి ముంజలు, ఈతకాయలకోసం పొలాలవెంట అలుపెరుగక తిరగటం ఎంతసరదాగా ఉండేదో ఇప్పటికీ కళ్ళముందు కనబడ్తూనే ఉంటుంది. పిల్ల కాలువలో స్నానాలు, బందరు కాలువలో ఒడ్డు పట్టుకు ఈదడం, చేతికి దొరికిన ఒండ్రుమట్టితో ఒళ్ళు నున్నగా రుద్దుకోవడం భలే సరదాగా ఉండేదిలే!
ప్రక్కనే ఉన్న నాయనమ్మగారి ఊరు ముళ్ళపూడి వెడితే తాతయ్య, నాయనమ్మ పలకరింపులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు,భావ, వదిన, పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త వాళ్ళే కాకుండ ఎంతో ఆప్యాయంగా పలకరించే మిత్రులతో గడిపిన ప్రతి క్షణం ఇప్పటికి సజీవంగా కళ్ళముందే సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. సమయం చిక్కినప్పుడు ఇప్పుడైనా అచ్చటికి వెళ్లినప్పుడు చిన్ననాటి ఆ ముచ్చట్లను నెమరు వేసుకొని అనంద తరంగాలలో తేలిపోవడం ఎంత హాయిగా ఉంటుందో వర్ణించాల్సిన అవసరం లేదు.మరి ఇప్పుడో? వృత్తిరీత్యా శెలవు ప్రకటించినా ఉపయోగించుకోలేని పరిస్తితి.
పోనీ ఈనాటి పిల్లల్ని కదిలిస్తే శెలవు రోజుకూడ ఏదోఒక కారణంతో తీరిక లేదని చెబుతారేతప్ప ఇలాంటి సరదాలలోతేలిపోవాలనే ఆలోచన మాత్రం వారి మనస్సులలో ఎట్టి పరిస్థితిలోను ప్రవేశించడం లేదు.గత దశాబ్ద కాలంలొ అనేక సార్లు తమ్ముళ్ళనో, చెల్లెళ్ళనో, వాళ్ళ పిల్లలనో, మనవరాళ్ళనో, మనవళ్ళనో శెలవలకు మా ఇంటికి రండిరా అని బ్రతిమిలాడినా ఏదో కుంటి సాకులు చెబుతారు తప్ప వచ్చి మాతో గడపరు. ఒక్కసారి మాత్రం మనవరాలిమీద అలిగి వాళ్ళఊరువెళ్ళికూడా వాళ్ళింటికి వెళ్ళకుండా వస్తే ఆ పిల్ల ఇంకోసారి వెళ్ళినప్పుడు మా వెంట (తాతయ్యకు కొపమొస్తుంది అంటూ) బట్టలు సర్దుకుని వచ్చింది. వచ్చిన దగ్గరనుండి నేనేదో ఆ పిల్లను కిడ్నాపు చేసినట్లు వాళ్ళంతా ఒకటే గోల చేసారు. నా మనస్సు మాత్రం బాధతో మూలిగి మనవరాలు వచ్చిందన్న సంతోషం హరించుకుపోయింది.
మా తమ్ముడి పిల్లలను మా నాయనమ్మగారి ఊరు వెడదాం రండిరా అని ఎంత బ్రతిమిలాడినా వచ్చేవాళ్ళుకాదు. ఒక సందర్భంలో వాళ్ళు అచ్చటికి వెళ్ళినప్పుడు వాళ్ళతరం పిల్లలతో కలిసి సంతోషంగా గడిపినప్పుడు మాత్రం అవాక్కయి "పెదనాన్నా నువ్వు చెబితే ఏంటో అనుకున్నాము, ఇక్కడగడిపిన ప్రతిక్షణం ఇంత ఆనందంగా ఉంటుందని అనుకోలేదు. ఇకనుంచి శెలవలిచ్చిన ప్రతిసారి ఇచ్చటికే వచ్చి మేం పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాము" అన్నారు.

మరి ఇప్పుడు పిల్లలను శెలవు రోజు హాయిగా ఆడుకోనిచ్చే తల్లితండ్రులెంతమంది?? చదవాలి, చదవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, జీవితంలోఎదగాలి, అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి....ఇదే రొద...సొద...గొడవ. ఇలాంటి ఆలోచనలతో సతమతమౌతున్న సమయంలో ఇదుగో ఇచ్చటిచ్చిన ఫొటోలో ఒక కవిత అప్పుడెప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయ్యింది. దాన్ని అలాగే ఫొటో తీసి దాచిపెట్టాను. మీకోసం ఇచ్చట ఇస్తున్నాను. చూసి మీ పిల్లలందరిచేతా చదివించండి. కొంతమందైనా వారి శెలవల్లో ఆనందపుటంచుల్లోకి వెళ్ళగలిగితే నా శ్రమ ఫలించినట్లే. అక్షరాలు స్పష్టంగా కనబడాలంటే ఫొటోపై క్లిక్ చేయండి.

Thursday, November 1, 2007

కొత్త నాన్నలకు స్వాగతం........

అప్పుడెప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో సంపాదకీయం చదివి అందరికి చూపించాలనే కోరికతొ ఫొటొగా తీసి జాగ్రత్త చేసాను. కుటుంబంలో నాన్న పరిస్థితి ఎలా మారి పోయిందో ఆ సంపాదకీయం చక్కగా ప్రతిబింబింప చేసింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో పెద్ద మార్పేమి రాలేదనే భావంతో ఇదిగో మీకోసం....ఆ పేజీ ఇక్కడ దర్శించండి.


అక్షరాలు అంతబాగా కనిపించుటలేదనుకుంటా. మామూలుగా ఫొటొ పెద్దది చేసి చూస్తే బాగానే కంపిస్తున్నయిగాని పోస్ట్ చేసినతర్వాత ఎలా పెద్దది చేయాలో నాకు తెలియడంలేదు. ఎలా పెద్దది చేయాలో చెప్పండి లేదా విషయం మొత్తం నేను కీబోర్డుతో కొట్టేదాకా ఆగవలసిందే.

56..56...56....56.....56...............

56:
ఈ సంఖ్యకు నాకు నేను పుట్టినప్పటినుండి ఏదో గమ్మత్తైన అనుబంధం నాకు తెలియకుండానే ఏర్పడిపోయింది. ఎందుకంటే నేను పుట్టింది 1956 లో(అక్టొబరు 31).
పదవతరగతిలో నాకు మార్కుల్లో 50 దాటింది ఒక్క లెక్కలలోనే. అది కూడా 56.
నా మొట్టమొదటి ఫోన్ సంఖ్య కూడా 56.
తర్వాత ఫోన్ సంఖ్య (1)56.
ఆ తర్వాత తీసుకున్న ఫోన్ సంఖ్య (2)56.
కొత్త క్లినిక్ ఫోన్ సంఖ్య కూడా (3)56.
ఒకసారి భువనేశ్వర్ జాతీయ సదస్సుకు వెడుతున్నప్పుడు నా బెర్తు సంఖ్య కూడా 56.

నా ఈ అనుబంధం మాత్రం నాకు స్పురించిందిమాత్రం ఆ రోజు ధూమశకటంలో నా పడక ఎక్కడుందో వెతుక్కుంటున్నప్పుడే.
ఈ సంఖ్యానుబంధం ఇంకా ఏ రూపంలో ఎదురవుతుందో ఎదురు చూదాల్సిందే.
కొసమెరుపు: నా వివాహం 1982లో నా పుట్టినరోజునే జరుపుకోవడం.(యాద్రుచ్చికం కాదు ! కావాలనే తీసుకున్న నిర్ణయం!)