Monday, November 5, 2007

శెలవుకు శెలవా????????????

"శెలవు" ఈ మూడక్షరాల మాట ఎవ్వరికైనా ఎంతిష్టమైన మాటోకదా ! మా చిన్నప్పుడు శెలవలిచ్చిన మరునాడే అమ్మమ్మ వాళ్ళ ఊరు ఐనంపూడి(పింగళి వెంకయ్య గారి ఊరు భట్లపెనుమర్రు ప్రక్కనే) చాలా హుషారుగా చేరేవాళ్ళము. చిన్ననాటి స్నేహితులతో కబుర్లు, ఆటలు, చెట్లు పుట్టలవెంట తిరుగుళ్ళు, తాటి ముంజలు, ఈతకాయలకోసం పొలాలవెంట అలుపెరుగక తిరగటం ఎంతసరదాగా ఉండేదో ఇప్పటికీ కళ్ళముందు కనబడ్తూనే ఉంటుంది. పిల్ల కాలువలో స్నానాలు, బందరు కాలువలో ఒడ్డు పట్టుకు ఈదడం, చేతికి దొరికిన ఒండ్రుమట్టితో ఒళ్ళు నున్నగా రుద్దుకోవడం భలే సరదాగా ఉండేదిలే!
ప్రక్కనే ఉన్న నాయనమ్మగారి ఊరు ముళ్ళపూడి వెడితే తాతయ్య, నాయనమ్మ పలకరింపులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు,భావ, వదిన, పెదనాన్న, పెద్దమ్మ, మేనత్త వాళ్ళే కాకుండ ఎంతో ఆప్యాయంగా పలకరించే మిత్రులతో గడిపిన ప్రతి క్షణం ఇప్పటికి సజీవంగా కళ్ళముందే సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. సమయం చిక్కినప్పుడు ఇప్పుడైనా అచ్చటికి వెళ్లినప్పుడు చిన్ననాటి ఆ ముచ్చట్లను నెమరు వేసుకొని అనంద తరంగాలలో తేలిపోవడం ఎంత హాయిగా ఉంటుందో వర్ణించాల్సిన అవసరం లేదు.మరి ఇప్పుడో? వృత్తిరీత్యా శెలవు ప్రకటించినా ఉపయోగించుకోలేని పరిస్తితి.
పోనీ ఈనాటి పిల్లల్ని కదిలిస్తే శెలవు రోజుకూడ ఏదోఒక కారణంతో తీరిక లేదని చెబుతారేతప్ప ఇలాంటి సరదాలలోతేలిపోవాలనే ఆలోచన మాత్రం వారి మనస్సులలో ఎట్టి పరిస్థితిలోను ప్రవేశించడం లేదు.గత దశాబ్ద కాలంలొ అనేక సార్లు తమ్ముళ్ళనో, చెల్లెళ్ళనో, వాళ్ళ పిల్లలనో, మనవరాళ్ళనో, మనవళ్ళనో శెలవలకు మా ఇంటికి రండిరా అని బ్రతిమిలాడినా ఏదో కుంటి సాకులు చెబుతారు తప్ప వచ్చి మాతో గడపరు. ఒక్కసారి మాత్రం మనవరాలిమీద అలిగి వాళ్ళఊరువెళ్ళికూడా వాళ్ళింటికి వెళ్ళకుండా వస్తే ఆ పిల్ల ఇంకోసారి వెళ్ళినప్పుడు మా వెంట (తాతయ్యకు కొపమొస్తుంది అంటూ) బట్టలు సర్దుకుని వచ్చింది. వచ్చిన దగ్గరనుండి నేనేదో ఆ పిల్లను కిడ్నాపు చేసినట్లు వాళ్ళంతా ఒకటే గోల చేసారు. నా మనస్సు మాత్రం బాధతో మూలిగి మనవరాలు వచ్చిందన్న సంతోషం హరించుకుపోయింది.
మా తమ్ముడి పిల్లలను మా నాయనమ్మగారి ఊరు వెడదాం రండిరా అని ఎంత బ్రతిమిలాడినా వచ్చేవాళ్ళుకాదు. ఒక సందర్భంలో వాళ్ళు అచ్చటికి వెళ్ళినప్పుడు వాళ్ళతరం పిల్లలతో కలిసి సంతోషంగా గడిపినప్పుడు మాత్రం అవాక్కయి "పెదనాన్నా నువ్వు చెబితే ఏంటో అనుకున్నాము, ఇక్కడగడిపిన ప్రతిక్షణం ఇంత ఆనందంగా ఉంటుందని అనుకోలేదు. ఇకనుంచి శెలవలిచ్చిన ప్రతిసారి ఇచ్చటికే వచ్చి మేం పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాము" అన్నారు.

మరి ఇప్పుడు పిల్లలను శెలవు రోజు హాయిగా ఆడుకోనిచ్చే తల్లితండ్రులెంతమంది?? చదవాలి, చదవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, జీవితంలోఎదగాలి, అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి....ఇదే రొద...సొద...గొడవ. ఇలాంటి ఆలోచనలతో సతమతమౌతున్న సమయంలో ఇదుగో ఇచ్చటిచ్చిన ఫొటోలో ఒక కవిత అప్పుడెప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయ్యింది. దాన్ని అలాగే ఫొటో తీసి దాచిపెట్టాను. మీకోసం ఇచ్చట ఇస్తున్నాను. చూసి మీ పిల్లలందరిచేతా చదివించండి. కొంతమందైనా వారి శెలవల్లో ఆనందపుటంచుల్లోకి వెళ్ళగలిగితే నా శ్రమ ఫలించినట్లే. అక్షరాలు స్పష్టంగా కనబడాలంటే ఫొటోపై క్లిక్ చేయండి.

6 comments:

డా.పి.మురళీ కృష్ణ. said...

ఈ నాటి తరం కోల్పోతున్న బాల్యం విలువను బాగా చెప్పారు. ఓ సూచన.. మీ బ్లాగు ప్రధానరంగుగా నీలం ను ఎంచుకోండి (ఆకుపచ్చ బదులుగా).

నా కథలు...... said...

ప్రసాద్ గారు మీ బ్లాగు చదివాను చాలా బాగుంది.నేను ఇప్పుడిప్పుడే రాయడం మొదలుపెట్టాను కావున కొన్ని తప్పులు దొర్లుతున్నాయి.ముందు ముందు ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్త పడతాను.నా తప్పులన్నీ సరి చేసుకొని మరలా బ్లాగు ప్రచురించాను ఒక సారి చదవగలరని ప్రార్ధన.

నా కథలు...... said...

ముద్రారాక్షసాలతో అనగా ఏమిటో తెలుపగలరని ప్రార్ధన.

Unknown said...

Good afternoon
its a nice information blog
The one and only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

teluguvision.com said...

telugu blog chala bagundhandi, mee lanti vaari valle telugu ki velugu inka undhi

Telugunetflix said...

Follow
https://www.telugunetflix.com
https://www.telugunetflix.com
https://www.telugunetflix.com