Tuesday, November 27, 2007

వరి....వరి....వరి....వరి....వరికుచ్చు




వరి....వరి....వరి....వరి....వరి ఎక్కడ చూసినా ఇదే పదం. వార్తాపత్రికలలో, బుల్లితెరపై, రాజకీయనాయకుల నోళ్ళలో, ఆఖరికి అమాయక రైతుల మదిలో కూడా ఇదేమాట ఒక పలవరింతగా ఇటీవల ప్రాచుర్యమై పోయింది. ప్రస్తుతం పంట చేతికివచ్చే సమయంలో రేగిన ఈ చిచ్చు వల్ల రైతుకు జరిగే మేలు మాటేమోగాని కూలివాళ్ళు దొరకక, కూలిరేటు పెరిగి పంట ఇంటికి తెచ్చుకోవడానికి రైతు పడుతున్న తిప్పలు చూస్తే ఎవరికైనా జాలిపుట్టక మానదు. బంగారు రంగులో కోతకు సిద్దంగాఉన్న పొలాలను చూస్తే ఆ మనోహరదృశ్యం మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడున్న ఫొటోలలో ఒకదాంట్లో కోతకు సిద్దంగాఉన్న పొలం, మరొకదాంట్లో కోతకోసిన పొలంకూడా చూడొచ్చు.
వరి కొయ్యడం, పనలను (కోతకోసి, చిన్న చిన్న కుప్పగావేసినవాటిని పనలంటారు) తిరగవెయ్యడం, కట్టలుగాకట్టి తరువాత వెంటనే నూర్చడంగాని, భవిష్యత్తులో నూర్చడానికి కుప్ప వెయ్యడంగాని చేస్తారు. నూర్చడమంటే ఒకచోట వేసి పశువులతోగాని, ట్రాక్టరుతోగాని తొక్కిస్తే వరిగింజలు(వడ్లు) గడ్డినుండి విడివడి మనకు వడ్లరాశినిస్తాయి. పశువులతో త్రొక్కించడానికి ముందు మనుషులతో చిన్నచిన్న కట్టలుకట్టి ఒకఏటవాలు చెక్క బల్లమీద కొడతారు. ఇప్పుడేమో ట్రాక్టరులొచ్చాయి త్రొక్కించడానికి. చాలాచోట్ల వరికోత యంత్రాలు వచ్చాయి....అవే కోస్తాయి, వడ్లను నూరుస్తాయి (తక్కువఖర్చుతో !). వచ్చిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి పూర్వంనేలలొ గుంట తీసి చుట్టూ వరిగడ్డితో అంచుల్ని లైనింగ్ చేసి, వడ్లుపోసి, చెత్తకప్పి పైనకూడా మట్టి కప్పి పాతర వేసేవాళ్ళు. తరువాత వెదురు లేదా అడవి చువ్వలతో అల్లిన గాదెలలో నిల్వచేసేవాళ్ళు. ఇప్పుడేమొ సిమెంటు లేదా ఇనుప గాదెలు వాటి స్థానాన్ని ఆక్రమించేసాయి. ఈ కష్టమంతా పంట పండినతరువాత కథ. పండించడానికి ఎంత శ్రమ పడాలో, ఎంత డబ్బు వెచ్చించాలో,ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనాలొ పాపం ఆ రైతులకే తెలుసు.


మొన్న ఆదివారం నేను తెనాలి దగ్గరలో ఉన్న పెరవలి, చావలి, పెరవలిపాలెం వెళ్ళడం జరిగింది. ఆ ఊళ్ళగురించి మా చిన్నప్పటినుంచి చెప్పుకోవడమే గాని వెళ్ళడం మాత్రం మొన్ననే. మాతాతలకాలం నుండి మాకు ఆ ఊళ్ళతో సంబంధాలున్నాయి. అక్కడ ఎక్కడొ బాపట్ల దగ్గర ఊళ్ళో పశువుల ఆసుపత్రిలో పనిచేస్తున్న మాతమ్ముడు వెంకటేశ్వరరావును కలవడం జరిగింది. కలిస్తే మాకేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది విశేషం. అతగాడు జేబులోంచి ఒక ఫొటో తీసి చూపించాడు..అది మన ముఖ్యమంత్రిగారితో తను "వరి కుచ్చు" ను బహుకరించే సమయంలో తీసి మరునాడు వార్తాపత్రికలలో ప్రచురింపబడింది. అదేంటోననే మా ఉత్సాహాన్ని పసిగట్టి వెంటనే తన సంచిలోనుంచి మరొక వరికుచ్చు బయటికి తీసి మా ముందు ప్రదర్శించాడు. అది ఆ రోజు సాయంత్రం మన మంత్రిగారైన మండలి బుద్ధప్రసాదు గారి బహుకరించడానికట. సరే మన బ్లాగుకు మంచి విషయం దొరికింది కదా అని మన వరికుచ్చుని, దాన్ని బహు నేర్పరితనంతో తయారుచెసిన తమ్ముని కూడా ఫొటోలు తీసి ఇదుగో ఇచ్చట మీకోసం ఇక్కడ అతికిస్తున్నాను.ఆ వరికుచ్చు చూడడానికి చాల సులువుగా చెయ్యవన్నట్లుగా ఉన్నా తయారుచెయ్యడం చాలా కష్టం సుమా!ఆ ముందురోజే రైతుగర్జనలో వరి కంకులతో అల్లిన దండలను నాయకులమెడలలో వెయ్యడం చాలామంది చూసే ఉంటారనుకుంటాను.

8 comments:

డా.పి.మురళీ కృష్ణ. said...

వరి కుచ్చు...ఎవరికుచ్చు...గిట్టుబాటు ధరలేని వరి రైతు ఈ నాటి రాజకీయచదరంగంలో ఓ పావు.అంతులేని ఆవేదన గుండెల్లోవున్నా చిన్నిచిన్ని సరదాలతో సేదతీరడం రైతన్నకే చెల్లు.ఇలా వరి కంకుల్ని కుచ్చులా అల్లి పిచుకల మేతకోసం చూరులోవుంచడంతో అవి కిచకిచలాడుతూ సందడి సందడిగా గింజలు తింటూ పొట్టనింపుకుంటుంటాయి.మరి వరి రైతుల కడుపునింపే నాధుడె'వరో'...

Unknown said...

వరికుచ్చు చాలా బాగుంది.

డా.పి.మురళీ కృష్ణ. said...

మీ బ్లాగు చూస్తే కళ్ళు పోయేటట్లున్నాయి,కనికరించగలరు.

శ్రినివాస రావు said...

చూరులో వేలాడే వరికుచ్చులు, కిచకిచ మనే పిచుకలు, కొత్తబియ్యపు అన్నము, నేతి అరిసెలు ఇంకా గతించలేదని గుర్తు చేస్తుంది మీ బ్లొగ్. చాలా థాంక్స్

GARAM CHAI said...

vara kachu bagundi
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

nice blogs
https://goo.gl/Ag4XhH
plz watch our channel

Unknown said...

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్ https://telugureads.com/telugu-book-reads-about-vikasam/